Srisailam | శ్రీశైలం దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం దేవస్థానం పరిధిలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్న పలువురు భక్తులతో ముఖాముఖీ సంభాషించారు. అన్న ప్రసాద వితరణపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులంతా కూడా అన్న ప్రసాద వితరణపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఈఓ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్న ప్రసాద వితరణలో ఆయా వంటకాలు రుచికరంగా ఉండేలా తగు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆయా వంటకాల్లో కూరగాయలను విరివిగా వాడాలని సూచించారు. అన్న ప్రసాద వితరణలో వండిన ప్రతి వంటకం కూడా ప్రతి భక్తుడికి అందేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అన్న ప్రసాద వితరణ సమయంలో ప్రతి హాలులో కూడా అన్న ప్రసాదాల వడ్డన సజావుగా సాగేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. ప్రతి హాలును కూడా ప్రత్యేకంగా సిబ్బంది ఒకరు నిరంతరం పర్యవేక్షిస్తుండాలని అన్నారు.
అన్న ప్రసాద వితరణలో ఖచ్చితంగా సమయ పాలన పాటించాలని సంబంధిత సిబ్బందిని ఈఓ ఎం శ్రీనివాసరావు ఆదేశించారు. ఉదయం వేళలో అన్న ప్రసాదాలు, సాయంకాలం అల్పాహారం ఎటువంటి కాలాతీతం కాకుండా భక్తులకు అందజేస్తుండాలని అన్నారు. అన్న ప్రసాదాలు స్వీకరించే భక్తులు కూడా అధిక సమయం వేచి ఉండకుండా ఎప్పటికప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తుండాలని అధికారులకు సూచించారు.