Srisailam Temple | శ్రీశైలం : ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారి శాకాంబరి ఉత్సవాల శ్రీశైల క్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఆలయాన్ని 2వేలకుపైగా కిలోల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించింది. వంగ, బెండ, దొండ, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు, మునగ, సార, బీర, గుమ్మడి, బంగాళదుంప, కందదుంప, క్యాప్సికమ్, క్యాబేజీ, బీన్స్, క్యారెట్, అరటికాయలు.. తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర ఆకుకూరలతో అందంగా అలంకరించారు. అలాగే. పుదిన, కరివేపాకు, కొత్తిమీర లాంటి సుగంధ పత్రాలతో పాటు కమల, బత్తాయి, ద్రాక్ష, ఆపిల్, అరటి, ఫైనాపిల్.. నిమ్మకాయలు, బాదంకాయలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో ఆదివారం భ్రమరాంబ అమ్మవారికి విశేష పూజలు జరిపించనున్నారు.
అమ్మవారి మూలమూర్తిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లుఫలాలతో అలంకరిస్తారు. అలాగే, అమ్మవారి ఉత్సవమూర్తి, ఆలయ ప్రాంగణంలో ఉన్న రాజరాజేశ్వరి దేవి, గ్రామదేవత అంకాళమ్మకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అమ్మవారిని శాకాలతో అర్చించడంతో అతివృష్టి, అనావృష్టి నివారించబడి.. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి.. పంటలు బాగా పండుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. కాగా, పూర్వం హిరణ్యాక్షుడి వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపోశక్తితో వేదాలను అంతర్ధానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. కరువుకాటకాలతో తీవ్రక్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆదిపరాశక్తిని కోసం తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణకోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసిందని ఆలయ పండితులు తెలిపారు.