Srisailam | శ్రీశైలం : శ్రీగిరి క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం భ్రమరాంబ అమ్మవారు కాత్యాయనీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాత్యాయనీ దేవి నాలుగు చేతుల్లో వరముద్ర, పద్మం, అభయముద్రలు, ఖడ్గాన్ని ధరించి సకల శుభప్రదాయని కాత్యాయనిమాతగా భక్తులను కటాక్షించింది.
కాత్యాయని అమ్మవారిని దర్శించడం వల్లనే జన్మజన్మ పాపాలన్నీ హరింపబడతాయని పండితులు తెలిపారు. వేడుకల్లో భాగంగా సాయంత్రం అక్కమహాదేవి అలంకారమండపంలో భ్రామరి సమేత మల్లికార్జున స్వామివార్లను హంసవాహనంపై వేంచేపు చేసి విశేష పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మహాసంకల్పం పఠించారు.
అనంతరం స్వామి అమ్మవార్లను ప్రాకారోత్సవం, గ్రామోత్సవంలో భాగంగా పల్లకీసేవ అంగరంగవైభవంగా నిర్వహించారు. వివిధ రకాలైన ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామిఅమ్మవార్లను వేంచేపు చేసి షోడశోపచార పూజలు చేశారు.
చెంచు కళాకారులతో పాటు ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుంచి కళాకారులు నాదస్వరం, కేరళ చండీ మేళం, కొముకోయ నృత్యం, థయ్యం, విళక్కు, స్వాగత నృత్యాలు, కోలాటం, వివిధ వేషధారణలు, ప్రదర్శనలు, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లన గ్రోవి, త్రిశూలం, జేగంట, కంచుడోలు, కొమ్ము, తాళాలు, చెక్కభజన, అమ్మవారి వేశం, తప్పెట చిందు, డోలు విన్యాసం, వీరభద్రడో లుకుణిత, కన్నడ జానపదాలు మొదలగు వివిధ రకాల విన్యాసాలతో ఆద్యంతం భక్తులను అలరించాయి.
గ్రామోత్సవం ఆలయ ప్రధాన ద్వారం నుంచి గంగాధరమండపం, నంది మండపం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు వరకు పుష్ప పల్లకీ సేవ సాగింది. హర హర మహదేవ ఆలయ పురవీధులన్నీ మార్మోగాయి. వేలాది భక్తులు హాజరైన ఆదిదంపతుల పుష్పపల్లకీ సేవను తిలకించారు. అనంతరం కాళరాత్రి పూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం భ్రమరాంబ అమ్మవారు కాళరాత్రి అలంకారంలో దర్శనిస్తారు. మల్లికార్జున స్వామితో కలిసి గజవాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు.