Srisailam | శ్రీశైలం : శ్రీగిరి క్షేత్రంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శనివారం భ్రమరాంబ అమ్మవారు కాత్యాయనీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాత్యాయనీ దేవి నాలుగు చేతుల్లో వరముద్ర, పద్మం, అభయముద్రలు, ఖడ్గాన్ని ధరించి సకల శుభప్రదాయని కాత్యాయనిమాతగా భక్తులను అనుగ్రహించింది. కాత్యాయని అమ్మవారిని దర్శించడంతో జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు. వేడుకల్లో భాగంగా సాయంత్రం అలంకారమండపంలో భ్రామరి సమేత మల్లికార్జున స్వామివార్లను హంసవాహనంపై వేంచేపు చేసి విశేష పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మహాసంకల్పం పఠించారు. అయితే, వర్షాల నేపథ్యంలో గ్రామోత్సవాన్ని రద్దు చేశారు.
Srisailam