Srisailam | శ్రీశైలం : విద్యార్థులు ఆగమ విద్యను మరింత సాధన చేయాలని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు సూచించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీరశైవాగమ పాఠశాలలో ప్రవేశం పొంది.. ఆరేళ్ల కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. 2018 -19 విద్యాసంవత్సరంలో ప్రవేశం పొందిన 25 మంది విద్యార్థులు దేవస్థానం పాఠశాలలో ప్రవేశ, వర, ప్రవర కోర్సులను పూర్తి పూర్తి చేశారు. ఈ క్రమంలో ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అభినందన సమావేశంలో ఈవో మాట్లాడుతూ ఆగమ విద్య ఎంతో గొప్పదని.. నియమ నిష్ఠలతో అభ్యసించాల్సి ఉంటుందన్నారు.
ఆరేళ్లు వీరశైవాగమ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులందరికీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల కృపా కటాక్షాలతో మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్థులందరూ ఆగమ విద్యను మరింతగా సాధన చేస్తూ, మరింత మందికి ఆగమ విద్యను నేర్పి, తాము విద్యనభ్యసించిన దేవస్థానం పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులందరూ కూడా నిరంతర పఠనంతో సంస్కృతం, జ్యోతిషం, వాస్తు మొదలైన అంశాలపై మరింత అవగాహనను పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులందరు అర్చక వృత్తిని స్వీకరించిన తర్వాత ఆయా ఆయాల్లో త్రికరణశుద్ధిగా పూజాధికాలు నిర్వర్తించాలన్నారు.
ముఖ్యంగా ఆయా ఆలయాలను సందర్శించే భక్తులకు సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. దేవస్థానం ఆగమ పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని, ఇప్పటికే తాను స్వయంగా అన్నవరం దేవస్థానం, కాంచీపురంలోని కంచిమఠ పాఠశాలలను పరిశీలించడం జరిగిందని చెప్పారు. ఆ విద్యార్థులను స్వామివారి శేస్త్రవస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మల్లికార్జున స్వామి ఆలయ ఆలయ ఉపప్రధానార్చకులు, ఆగమ పాఠశాల ప్రిన్సిపల్ శివశంకరయ్యస్వామి, పర్యవేక్షకులు డీ నాగేశ్వరరావు, పాఠశాల ఆంగ్ల అధ్యాపకులు డీ లక్ష్మీనారాయణ, తదితర సిబ్బంది పాల్గొన్నారు.