Srisailam | శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఉత్సవాల సందర్బంగా శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఐదవరోజు గురువారం భ్రమరాంబాదేవి స్కందమాతగా భక్తులను అనుగ్రహించారు. స్కందమాతగా చతుర్బుజాలు కలిగి పద్మం, కమలం, అభయహస్తం, ఒడిలో బాల షణ్ముఖుడైన కుమారస్వామి (స్కందుడు) ని ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. శేషవాహనంపై శ్రీశైల మల్లన్నతో కలిసి భక్తులను కరుణించింది.
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకారమండపంలో శేషవాహనంపై భ్రమరాంబ సహితంగా అధిష్టించిన మల్లికార్జున స్వామి వారికి ప్రధాన అర్చకులు, వేదపండితులు వాహనసేవ వైభవంగా జరిపించారు. అలంకీకృతమైన స్కందమాత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను భక్తులు కనువిందుగా దర్శించుకున్నారు.

గ్రామోత్సవంలో భాగంగా ఉత్సవ మూర్తులు శేషవాహనంపై గంగాధర మండపం నుండి నంది మండపం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు విహరిస్తూ భక్తాదులను కరుణించారు. గ్రామోత్సవంలో నాదస్వరం, మహిళా వీరగాని కన్నడ జానపద కళాప్రదర్శన, రాజభటుల వేషాలు, కేరళ వారి కథకళి వేషాలు, తప్పెట చిందు, లంబాడి నృత్యం, కాళికా నృత్యం, చెక్కభజన, కోలాటం, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లగ్రోవి, త్రిశూలం, జేగంట, కురవడోలు, కొమ్ము, నందికోలు సేవ తదితర విన్యాసాలతో ఆద్యంతం కనులపండువగా సాగింది .
ఉత్సవం తరువాత సువాసిని పూజ, కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు తీర్థప్రసాద వితరణ, ఆది దంపతులకు ఆస్థానసేవ జరిపించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, శ్రీశైలప్రభ సంపాదకులు అనీల్‌కుమార్, ఎఈవోలు మోహన్, హరిదాసు, పర్యవేక్షకులు రవికుమార్, స్వాములు ఉన్నారు.

శరన్నవరాత్రుల్లో ఆరవరోజు శుక్రవారం భ్రమరాంబాదేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమివ్వనున్నారు. మల్లికార్జున స్వామివారికి హంసవాహసేవ నిర్వహించనున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.