తిరుపతి : తిరుపతి(Tirupati) శ్రీ కోదండరామస్వామి( Kodanda Ramaswamy )వారి ఆలయంలో గురువారం శ్రీరామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం మూలవర్లకు అభిషేకం చేశారు. ఉదయం ఊంజల్ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం(Tirumanjanam) నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
సాయంత్రం పెద్దజీయర్‌స్వామివారి మఠం నుంచి అర్చకులు నూతన వస్త్రాలను తీసుకొని విమానప్రదక్షిణగా వచ్చి స్వామివారి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించారు. ఆ తరువాత శ్రీరామ జన్మపురాణం, ఆస్థానం నిర్వహించారు. అనంతరం ఊంజల్‌సేవ నిర్వహణ అనంతరం ఉత్సవమూర్తులను వాహన మండపానికి తీసుకొచ్చారు.
రాత్రి 7 గంటలకు శ్రీరామచంద్రమూర్తి తన ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్, సూపరింటెండెంట్ రమేష్ కుమార్, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.