తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన( Tirumanjanam) కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ , రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. 7న శ్రీరామ పట్టాభిషేకాన్ని రాత్రి 8 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారని వెల్లడించారు.