TTD Brahmotsavalu | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు సోమవారం రాత్రి అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వాహనసేవ జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియ్యంగార్లు వేద మంత్రాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల చివరి రోజైన మంగళవారం ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు స్వామి పుష్కరిణిలో స్నప్న తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు ధ్వజావరోహణం జరుగుతుంది.