తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 14న ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారిని నాలుగు మాడవీధులలో ఊరేగించి వసంతోత్సవ మండపానికి తరలిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన తరువాత తిరిగి ఆలయానికి చేరుస్తామన్నారు. 15న బంగారు రథంపై ఊరేగింపు, 16న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారని వివరించారు.
ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తామన్నారు. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 14 నుంచి 16వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవను టీటీడీ రద్దు చేసిందని అధికారులు పేర్కొన్నారు.