తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్శరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నుంచి ప్రత్యేక టోకెన్లను ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 9 నుంచి దర్శనానికి అనుమతించనున్నామని అధికారులు వెల్లడించారు. కాగా ఇవాళ అంగప్రదక్షణానికి జారీ చేయవలసిన టోకెన్ల జారీని ఏప్రిల్ 2కు వాయిదా వేశారు.
శుక్రవారం కారణంగా టోకెన్ల జారీని నిలిపివేసినట్లు తెలిపారు. తిరిగి ఏప్రిల్ 3 నుంచి రోజుకు 750 చొప్పున అంగ ప్రదక్షణ టోకెన్లు జారీ చేయనున్నామని వివరించారు. ఇదిలా ఉండగా నిన్న తిరుమల శ్రీవారిని 61,224 మంది భక్తులు దర్శించుకోగా 33,930 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.02 కోట్లు వచ్చిందని వెల్లడించారు.