విజయవాడ: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి-హైదరాబాద్ మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైలు (07509) ఆగస్టు 6, 13, 20 తేదీల్లో హైదరాబాద్లో సాయంత్రం 4.35 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి (07510) రైలు ఆగస్టు 7, 14, 21 తేదీల్లో రాత్రి 11.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. అలాగే మరో రైలు (07433) ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో హైదరాబాద్లో సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుతుంది. అలాగే 07434 రైలు ఆగస్టు 3, 10, 17, 24, 31 తేదీల్లో సాయంత్రం 5.20 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
వీటితో పాటు నాందేడ్, తిరుపతి, ఔరంగాబాద్ మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొన్నది. నాందేడ్ ప్రత్యేక రైలు (07633) ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు (జూలై 31) ఉదయం 8.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 07634 ఈ నెల 31వ తేదీ రాత్రి 9.10 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 5.20 గంటలకు నాందేడ్ చేరుతుంది. మరో ప్రత్యేక రైలు ఆగస్టు 7, 14, 21 తేదీల్లో తిరుపతిలో ఉదయం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుంది. ఔరంగాబాద్ (07638) ఆగస్టు 8, 15, 22 తేదీల్లో రాత్రి 11.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
విజయవాడ-నిడదవోలు డబ్లింగ్ పనులు పూర్తి
విజయవాడ-నిడదవోలు రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కేవలం 40 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ పనులు పూర్తి కావాల్సి ఉన్నది. లోక్సభలో వైసీపీ సభ్యుడు బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. గుడివాడ, భీమవరం, నర్సాపూర్, మచిలీపట్నం మీదుగా విజయవాడ-నిడదవోలు లైనుకు రూ.4,106 కోట్లతో 221 కిలోమీటర్ల పొడవునా డబ్లింగ్ పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. 2022 మార్చి వరకు రూ.3,807 కోట్ల వ్యయం జరిగిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తన వాటా కింద ఇప్పటివరకు రూ.289 కోట్లు అందించినట్లు వెల్లడించారు.