విశాఖపట్నం : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. విశాఖపట్నం-బెంగళూరు, బెంగళూరు-విశాఖపట్నం మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రత్యేక రైలు నంబర్ 08543 ఆగస్టు 7, 14, 21, 28, సెప్టెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు బెంగళూరు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08544 నంబర్ ప్రత్యేక రైలు బెంగళూరులో ఆగస్టు 8, 15, 22, 29, సెప్టెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, బంగారుపేట, కృష్ణరాజపురం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2వ ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. కాగా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఇవాళ నాందేడ్ నుంచి కాజీపేటకు ప్రత్యేక రైలును నడపనున్నది. ఈ ప్రత్యేక రైలు 07489 సోమవారం రాత్రి 8.35 గంటలకు నాందేడ్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కాజీపేట చేరుకుంటుంది.