తిరుమల : తిరుమలలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అత్యంత వైభవంగా గరుడసేవను(Garuda Seva) నిర్వహించనున్నారు. సుమారు 3.50 లక్షల మంది భక్తులు తిరుమలకు రావొచ్చని అంచనా. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో(TTD EO) శ్యామలరావు మీడియాకు వెల్లడించారు.
సాయంత్రం 6.30 నుంచి 11.30 గరుడ వాహనసేవ జరుగుతుందని ఆయన వివరించారు. గ్యాలరీల్లో రెండున్నర లక్షల మంది కూర్చొనేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మూడువేల ఆర్టీసీ ట్రిప్పులతో భక్తులను తిరుమలకు తీసుకొస్తామని తెలిపారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ సుబ్బారాయుడు
తిరుమలలో గరుడ సేవకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ సుబ్బారాయుడు (SP Subbaraidu) వెల్లడించారు. రేపు రాత్రి 9 నుంచి ఘాట్రోడ్డులో బైకులు, కార్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ నెల 9 ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో అనుమతి లేదని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.