Srisailam | శ్రీశైలం : లోక కల్యాణార్థం పంచమఠాల్లో సోమవారం ఉదయం విశేష అభిషేకం, పుస్పపుష్పార్చనలు జరిపించారు. మొదట ఘంటామఠంలో ఆ తర్వాత.. భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాల్లో పూజలు కొనసాగాయి. ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలనీ, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. అనంతరం ఘంటామఠంలో గణపతికి పూజలు చేశారు. ఆ తర్వాత అన్ని మఠాలలో సంప్రదాయబద్ధంగా అభిషేకాది అర్చనలను నిర్వహించారు. శ్రీశైల సంస్కృతిలో చాలాకాలం పాటు మఠాలు ప్రధానపాత్ర పోషించాయి.
ప్రస్తుత సాధారణశకం 7వ శతాబ్దం నుంచి నిర్మించబడ్డ ఈ మఠాలు, గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం లాంటి నిర్మాణాలను ఉండడం, చూడటానికి ఆలయాల మాదిరిగానే కనిపిస్తుంటాయి. కొన్ని శతాబ్దాల నుంచి కూడా ఈ మఠాలన్నీ క్షేత్ర ప్రశాంతతలోనూ, ఆలయ నిర్వహణలోనూ, ఆధ్యాత్మికపరంగా, భక్తులకు సదుపాయాలను కల్పించడంలోనూ ప్రధాన భూమికను వహించాయి. శ్రీశైలంలో కొన్ని మఠాలు కాలగర్భంలో కలిసిపోగా.. ప్రస్తుతం ఆలయానికి దగ్గరలో వాయువ్య భాగాన ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధరమఠం అనే మఠాలు పంచమఠాలనే పేర్లతో పిలుస్తుంటారు. శిథిలావస్థలో ఉన్న ఈ మఠాల్లో ఘంటామఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠాలను దేవస్థానం పూర్తిగా పునరుద్ధరించింది. ప్రాచీన నిర్మాణశైలికి ఎలాంటి విఘాతం కలుగకుండా ఈ పునర్నిర్మాణ పనులు చేపట్టింది. భీమశంకర మఠానికి తగు మరమ్మతులు చేయించింది. ఈ మఠాలలోని దేవతామూర్తులకు నిత్యధూపదీప నివేదన కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి కర్నూలుకు చెందిన చిన్న శంకరప్ప రూ.5,00,116 విరాళంగా అందించారు. అలాగే, గో సంరక్షణ పథకానికి విరాళం రూ.5,00,116 అందించారు. ఈ మొత్తానికి సంబంధించిన బ్యాంకు చెక్కులను ఈవో ఎం శ్రీనివాసరావుకు అందజేశారు.