విజయవాద: వినాయక చవితి ఉత్సవాలపై నిబంధనలు విధించడాన్ని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ నిబంధనలను వెంటనే ఎత్తివేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. చవితి ఉత్సవాలపై నిబంధనలు విధించడం సరికాదన్న ఆయన.. పండుగను స్వేచ్చగా, ఆనందంగా జరుపుకునేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. చవితి వేడుకల్లో డీజే సౌండ్ సిస్టమ్, సాంస్కృతిక కార్యక్రమాలను అడ్డుకోవద్దని తన లేఖలో సీఎం జగన్ను కోరారు.
వినాయక మండపాలకు తాత్కాలికంగా విద్యుత్ కనెక్షన్ తీసుకోవడం సాధ్యం కాదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. నిబంధనల పేరుతో మండపాల నిర్వాహాకులను ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం ఏంటని ఆయన మండిపడ్డారు. చవితి ఉత్సవాలను ఆనందంగా జరుపుకునేలా అవకాశం కల్పించాలని జగన్కు లేఖలో కోరారు. వినాయక చవితి ఉత్వసాలను భక్తిశ్రద్ధలతో పల్లెపల్లెలో విధిలో పట్టణ, నగరాల్లోని అన్ని కూడళ్లలో జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి హిందూ ధర్మ ఆచారం అని తమకు తెలియంది కాదన్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలుగానీ జరుపడానికి వీలులేకుండా అఫిడవిట్లు ఇవ్వాలని నిర్వాహకులను సంతకాలతో ముందస్తు హామీ పత్రం తప్పనిసరి చేయడం తగదన్నారు.
వినాయక చవితి ఉత్సవాలు జరుపాలంటేనే హిందువులు భయపడేలా నిబంధనలు విధించడం ఏమాత్రం సరికాదన్నారు. ఇలాంటి చర్యల ద్వారా మీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని మండిపడ్డారు. ఇకనైనా నిబంధనలను వెంటనే ఎత్తివేసి సజావుగా చవితి ఉత్సవాలు జరిగేలా చూడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.