విజయవాడ: అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అటు అధికార పార్టీ నేతలు బస్సు యాత్ర చేపట్టి ప్రజలను చేరేందుకు ప్రయత్నిస్తుండగా.. ప్రతిపక్ష బీజేపీ మాత్రం కేంద్ర నాయకులను దింపుతూ తమదే అధికారం అంటూ డాంబికాలకు పోతున్నది. మరోవైపు మహానాడు సక్సెస్‌తో ఊపుమీదున్న టీడీపీ.. ఇదే ఒరవడి కొనసాగించాలని నిర్ణయించింది. ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. వీటన్నింటిపై ఏపీలో రసవత్తరమైన చర్చ కొనసాగుతున్నది.
పొత్తులపై బీజేపీ నేతలు, జనసేన నేతలు తలో రకంగా మాట్లాడుతుండటంతో.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది నేతల వ్యాఖ్యలు వింటుంటే రెండు పార్టీల మధ్య దూరం పెరిగినట్లుగా తెలుస్తున్నది. పవన్ కల్యాణ్‌ను సీఎం క్యాండెట్‌గా ప్రకటించకపోవడంపై జనసేన నేతలు పలువురు గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తున్నది. జనసేన ఇబ్బందుల్లో ఉన్న సమయంలో బీజేపీ పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నదని గోదావరి జిల్లాల ఇంఛార్జీ బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. అలాంటి బీజేపీతో తాము పొత్తు పెట్టుకునేది లేదని తెగేసి చెప్తున్నారు. బీజేపీతో పొత్తుతో తమకు ఒరిగేదేమీ లేదని కూడా ఆయన అన్నారు.
కాగా, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఆత్మకూరు బైపోల్స్ ప్రచారం నిమిత్తం ఇక్కడికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తుల విషయంపై జనసేన సీనియర్ నేత నాదెంట్లతో టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలను మీడియా గుర్తు చేయగా, జనసేనలో చాలా మంది వెర్రిపుష్పాలు ఉన్నారని, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇలా ఉండగా, బీజేపీతో పొత్తు విషయం గురించి జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటికీ ఎక్కడ కూడా ఒక్క వ్యాఖ్య కూడా చేయకపోవడం విశేషం.
ishetti criticism on alliance