Pawan Kalyan | సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తనకు సినిమాల కంటే సమాజం, గ్రామాలే ముఖ్యమని తెలిపారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. మైసూర్వారి పల్లిలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుదని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే కూటమి లక్ష్యమని తెలిపారు.
దేశ అభివృద్ధికి గ్రామ పంచాయతీలే కీలకమని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది వైసీపీకి చెందిన సర్పంచ్‌లే ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వర్ణ పంచాయతీల ఏర్పాటే మనందరి ముందు ఉన్న లక్ష్యమని పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలు కీలకమని పవన్ కల్యాన్ అన్నారు. రూ.41 వేల కోట్లు ఉపాధి హామీ పథకానికి ఖర్చు పెట్టామని గత ప్రభుత్వం చెప్పిందని అన్నారు. కానీ వాస్తవంగా ఖర్చు పెట్టింది రూ.15వేల కోట్లే అని అన్నారు. అన్నా హజారే ఒక సర్పంచ్‌గా గెలిచి యావత్ దేశాన్ని కదిలించారని తెలిపారు. ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశంలో మార్పు తీసుకురావచ్చని ఆయన నిరూపించారని పేర్కొన్నారు. అది గ్రామానికి ఉన్న బలమని పేర్కొన్నారు. గ్రామాలన్నీ బలపడితే రాష్ట్రానికి ఉన్న అప్పులు కూడా తీర్చేయవచ్చని అన్నారు.
కోస్తా కంటే కూడా ఎక్కువ గనులు ఉన్న ప్రాంతం రాయలసీమ అని పవన్ కల్యాణ్ తెలిపారు. రాయలసీమ చదువుల నేల అని అన్నారు. సుగాలి ప్రీతి ఫ్యామిలీని పరామర్శించేందుకు వస్తే లక్షలాది మంది తరలివచ్చారని గుర్తుచేశారు. మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అప్పుడే అర్థమైందని తెలిపారు. మన దగ్గర మిరాకిల్ ఏం లేదని.. పనిచేయాలన్న చిత్తశుద్ధి ఉందని చెప్పారు. గుండెల నిండా కమిట్మెంట్తో పనిచేస్తానని పేర్కొన్నారు. అపార అనుభవం ఉన్నచంద్రబాబు దగ్గర నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.