Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మార్గశిర శుద్ద స్కందషష్టి మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈఓ పెద్దిరాజు దంపతుల ఆధ్వర్యంలో సోమవారం షష్టితిథి సందర్బంగా కుమారస్వామికి పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలతో, షోడషోపచార పూజాధి క్రతువులు జరిపించారు. లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక వేదపండితులు మహా సంకల్పాన్ని పఠించి ప్రత్యేక హోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన సుబ్రహ్మణ్యస్వామి జన్మదినోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించిన తరువాత భక్తులకు దర్శనాలు కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
స్కంద షష్టి సందర్బంగా శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివార్ల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు స్కందషష్టి పర్వదిన విశేషాన్ని భక్తులకు వివరించారు. వివిధ ప్రాంతాల నుండి క్షేత్రానికి చేరుకోలేని భక్తుల కోసం అందుబాటులో ఉంచిన పరోక్షసేవలో కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని ఈఓ పెద్దిరాజు తెలిపారు. అదే విధంగా క్షేత్రానికి సమీపంలో గల సున్నిపెంట గ్రామంలో కొలువైన సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణలోని అసిఫాబాద్ ఎమ్మల్యే కోవా లక్ష్మి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.