అమరావతి : రాజీనామాలు ఆమోదించాలని ఏపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు మండలి చైర్మన్‌కు విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఏపీ మండలి చైర్మన్ మోషేన్‌రాజు (Chairman Moshen Raju) ను కలిశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ( Venkata Ramana) కొన్ని నెలల క్రితం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ మండలి చైర్మన్‌కు లేఖను పంపారు.
లేఖ పంపి నెలలు గడుస్తున్న చైర్మన్ ఆమోదించక పోవడంతో వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని హైకోర్టు మండలి చైర్మన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రతిని సోమవారం మండలి చైర్మన్‌కు అందజేశారు. ఆయనతో పాటు మిగత ఎమ్మెల్సీలు పద్మశ్రీ , కల్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, మర్రి రాజశేఖర్, మరొకరు మండలి చైర్మన్‌ను కలిసి మరోసారి విన్నవించారు.
ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొన్ని నెలలు కిందట వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. తాము స్వచ్ఛందంగా పదవికి, పార్టీకి రాజీనామా చేశామని, ఎవరి ఒత్తిళ్లు లేవని పేర్కొంటూ స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా లేఖను అందజేశారు. రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు.