Srisailam | శ్రీశైలం : ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలం దేవస్థానంలో శ్రావణమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 3 గంటలకు మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల ఆలయ ద్వారాలు తెరిచి.. ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. 4.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతించారు. భక్తులు వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో స్నానాలు చేసి స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరారు. సాయంత్రం కాలం వరకు భక్తులు దర్శనాలు చేసుకున్నారు. నాలుగు వరుసల క్యూలైన్లలో భక్తులకు దర్శనాలు కల్పించారు. క్యూలైన్లలో భక్తులకు మంచినీరు, బిస్కెట్స్, అల్పహారం అందించారు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, ఆర్జిత కుంకుమార్చలను నిలిపివేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మరో వైపు ఉదయం 10.30 గంటల నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ భవనంలో అన్నదానం చేశారు. అలాగే, రాత్రి 7 గంటల నుంచి అల్పహారం ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి.
శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో శివచతుస్పప్తాహ భజనలు ప్రారంభమయ్యాయి. సోమవారం ప్రారంభమైన ఈ భజన కార్యక్రమాలు రేయింబవళ్లు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. పవిత్ర అఖండ భజనలు శ్రావణమాస ప్రారంభం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని వీరశిరోమండపంలో ప్రారంభించగా.. ఈవో పెద్దిరాజు, అర్చకులు పాల్గొన్నారు. ముందుగా వేదపండితులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించారు. అనంతరం కార్యక్రమం విజయవంతంగా సాగాలని మహాగణపతిపూజ జరిపించారు. అనంతరం శాస్త్రోక్తంగా చండీశ్వరస్వామివారికి విశేషపూజలు నిర్వహించి.. శివప్రణవ పంచాక్షరీనామ భజనను మొదలుపెట్టారు. ఏపీలోని కర్నూలుకు చెందిన అయిదు భజన బృందాలు, కర్ణాటకకు చెందిన మూడు భజన బృందాలకు ఈ శ్రావణమాస శివభజనలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఎనిమిది బృందాలు విడతలవారీగా భజన కార్యక్రమాలు కొనసాగించనున్నారు.