Srisailam Temple | ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒటైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 3 వరకు శ్రావణమాసం వేడుకలు జరుగనున్నాయి. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై పరిపాలన భవనంలో ఆలయ ఈవో పెద్ది రాజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. శ్రావణ సోమవారాలు, పౌర్ణమి, వరలక్ష్మీవ్రతం, శుద్ధ, బహుళ ఏకాదశి రోజులు, శ్రావణ మాసశివరాత్రి, సెలవు రోజుల్లో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
శ్రావణమాసంలో ఐదురోజుల పాటు భక్తులకు అలంకార దర్శనాలు కల్పించనున్నట్లు ఈవో తెలిపారు. ఆగస్టు 15 నుంచి 19 వరకు స్పర్శ దర్శనాలను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఏకాదశి, వరలక్ష్మీవ్రతం, శ్రావణ పౌర్ణమి పర్వదినాల్లో ఆలయానికి భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని శని, ఆది, సోమవారాలు, స్వాతంత్య్ర దినోత్సవం, వరలక్ష్మీవ్రతం, శ్రావణ పౌర్ణమి రోజుల్లో గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, ఆర్జిత కుంకుమార్చనలు పూర్తిగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. అభిషేకాలను నిలిపివేసే రోజుల్లో రోజుకు నాలుగు విడతల్లో స్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. స్పర్శ దర్శనం టికెట్లు ప్రస్తుతం దేవస్థానం వెబ్సైట్ srisailadevasthanam.org ద్వారా ఆయా టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. మిగతా రోజుల్లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. భక్తులు ఆర్జిత సేవాటికెట్లను ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆలయ ద్వారాలు వేకువ జామున 3గంటలకు తెరిచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాల పూజలు చేయనున్నట్లు తెలిపారు. 4.30 గంటల నుంచి మహామంగళహారతి నుంచే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామన్నారు.
సాయంత్రం 4 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుందని.. తిరిగి సాయంత్రం 4గంటల తర్వాత ఆలయ శుద్ధి నిర్వహించి.. మంగళవాయిద్యాలు, ప్రదోషకాల పూజ, సుసాంధ్యం తర్వాత 5.30 గంటల మహామంగళహారతి ప్రారంభమవుతుందని, అప్పటి నుంచి రాత్రి 11గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయని వివరించారు. ఆగస్టు 16న 1500 మంది ముత్తయిదువులతో సామూహిక వరలక్ష్మీ వ్రతం జరిపిస్తామన్నారు. అలాగే, నాల్గో శుక్రవారం 500 మంది చెంచు, 1000 మంది ఇతర భక్తులతో వ్రతం చేయించనున్నట్లు తెలిపారు. భఖ్తులకు ప్రసాదాలతో పాటు చీర, రవికవస్త్రం, గాజులు, పుసుపు కుంకుమలు, కైలాస కంకణాలు, శ్రీశైల ప్రభ మాసపత్రిక అందజేయనున్నట్లు చెప్పారు. వత్రకర్తలకు స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించడంతో పాటు శేషవస్త్రంగా చీరెను అందజేయనున్నట్లు తెలిపారు. అయితే, చీరె అందించడం తొలిసారని వివరించారు. అలాగే, భక్తుల సౌకర్యార్థం పరోక్ష సేవగా వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకునే అవకాశం దేవస్థానం కల్పిస్తుందన్నారు. లోక కల్యాణార్థం అఖండ చతుస్పప్తహ శివభజనలు జరిపించనున్నట్లు ఈవో పెద్ది రాజు వివరించారు.