అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దల అండదండలతో కొనసాగిన ప్రధాన యూనియన్ల కార్యవర్గం రాజీనామా బాట పట్టింది. ముఖ్యంగా క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంత ఇంతా కాదు.
ఏపీలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association) నాటి వైసీపీ ప్రభుత్వ కనుసన్ననలో నడిచింది. వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి (YCP MP Vijayasai Reddy) కి చెందిన కుటుంబ సభ్యులు ఏసీఏను చేజిక్కించుకుని ఐదేండ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో ఏసీఏపై కూటమి నేతలు గురిపెట్టారు. ఇందులో భాగంగా ఆదివారం విజయవాడలో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడుగా కొనసాగుతున్న శరత్‌చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు రోహిత్ రెడ్డి, కార్యదర్శి గోపినాథ్ రెడ్డితో సహ సభ్యులు రాజీనామా చేశారు. ఈ రాజీనామాను సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అదేవిధంగా సెప్టెంబర్ 8న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు ఎన్నికలు జరుపాలని సమావేశం తీర్మానించింది.
నెల రోజుల వరకు ఏసీఏ నిర్వహణకు గాను ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్నికలను నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్(NImmagadda Ramesh kumar) ను ఎన్నికల అబ్జర్వర్‌గా నియమించామని నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో విశాఖ ఉత్తర ఎమ్మెల్యేవిష్ణుకుమార్రాజు , జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.