అమరావతి : రోగుల ప్రాణాలను కాపాడే వారిని వైద్యో నారాయణ హరీ అంటారు. కాని ఓ కిలాడీ నకిలీ డాక్టర్ (Fake Doctor) అవతారమెత్తి రోగుల వద్ద ఉన్న నగదు(Cash), బంగారు ఆభరణాలను (Gold Jewellers) చోరీ చేయడం వృత్తిగా ఎంచుకొని చివరకు కటకటాలపాలై ఊచలు లెక్కబెడుతుంది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో (Ruya Hospital) జరిగిన ఘటన వివరాలు తెలుసుకుందాం.
వైఎస్సార్ జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి అనే యువతి అనస్తీషియా టెక్నీషియన్ (Anesthesia technician) అంటూ రోగులను నమ్మించి మోసాలకు పాల్పడుతుంది. రెండు రోజుల క్రితం వెస్లీ అనే మహిళ గాయాలతో రుయా ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరిచయం చేసుకున్న నకిలీ డాక్టర్ స్కానింగ్ కోసం థియేటర్లోకి తీసుకెళ్లి ఒంటిపై ఉన్న నగలు తీసేయాలని సూచించగా ఆమె ఒంటిపై ఉన్న రెండు బంగారు చైన్లు, రెండు బంగారు గాజులు తీసి యువతి చేతికి ఇచ్చి బయట ఉన్న తన భర్తకు ఇవ్వాలని కోరింది.
అయితే ఇక్కడే నకిలీ డాక్టర్ చేతివాటం ప్రదర్శించి బంగారు గొలుసును తన బ్యాగులో వేసుకుని మిగిలిన వస్తువులను వెస్లీ భర్త చేతికి ఇచ్చింది. తన భార్యపై మరో చైన్ ఉండాలని భర్త విక్టరీ నిలదీయడంతో తనకేమి తెలియదంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.
స్కానింగ్ నుంచి బయటకు వచ్చిన వెస్లీ నగలు చూసి అందులో ఒక చైన్ లేకపోవడాన్ని గమనించి సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టి పట్టుకున్నారు. ఆమె బ్యాగులో ఉన్న బంగారు చైన్‌ను గుర్తించి పోలీసులకు అప్పగించారు.