హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చడంపై ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం అది మనకే గౌరవం అని అభిప్రాయపడ్డారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుకున్న పవిత్రత గంగలో కలిసిపోతుందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మారుస్తూ జగన్ సర్కార్ అసెంబ్లీలో సవరణ బిల్లును తీసుకొచ్చి ఆమోదింపజేసుకున్నది. దాంతో ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పటికే అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవులకు రాజీనామా చేశారు. అలాగే, వైసీపీ వల్లభనేని వంశీ కూడా వ్యతిరేకంగా స్పందించారు. బీజేపీ, టీడీపీ, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా స్పందించారు. పేరు మార్చడం కరెక్ట్ కాదన్నారు. దాని పవిత్రత దెబ్బతింటుందని.. ఇలా పేర్లు మార్చుకుంటూ పోతే చివరకు పేర్లు మిగలవన్నారు. జనాలకు కూడా కన్ఫ్యూజన్లోకి నెట్టివేసేలా తయారవుతుందని అభిప్రాయపడ్డారు. పేరు మార్చడం వల్ల మనకు మనమే అగౌరవపర్చుకుంటున్నట్లు ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్ పేరు పెట్టడం అదో గౌరవమని, ఇప్పుడు పేరు మార్చడం వల్ల ఆయనకు అగౌరవం ఆపాదించినట్లు అవుతుందని పేర్కొన్నారు.