అమరావతి : సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు ( Seven fishermen ) సురక్షితంగా ఉన్నారని మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. వారంతా కోల్కత్తా( Kolkata ) నది తీరానికి క్షేమంగా, ఆరోగ్యంగా చేరుకున్నారని సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
ఈనెల 3న అల్లవరం మండలం ఓడలరేవు నుంచి ఏడుగురు మత్స్యకారులు బోటులో చేపల వేటకు బయలు దేరారు. వారంతా ఈనెల 10వ తేదీని తిరిగి రావాల్సి ఉండగా అప్పటి నుంచి అధికారులకు , కుటుంబ సభ్యులకు సమాచారం అందకపోవడంతో గల్లంతైనట్లు కేసు నమోదు చేసి ఆచూకీ కోసం అన్ని చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి. ఈ దశలో 23 రోజుల తరువాత గురువారం ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్లోని కోల్క్తలో సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని రాష్ట్ర మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందడంతో వారు కుటుంబ సభ్యులకు చేరవేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.