అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఏడుగురు మృతిచెందారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సమీపంలో ఓ లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను జిల్లాలోని స్టాలిన్ నగర్‌కు చెందిన చాకలి పవన్, శ్రీనివాస్, ముస్తాక్, ఎస్. పవన్‌గా గుర్తించారు.
తిరుపతి జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చిల్లకూరు జాతీయ రహదారిపై ఆగిఉన్న కంటైనర్‌ను వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో అది లారీ కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మృతులను నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా అరుణాచలం నుంచి దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రెండు ఘటనలపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.