అమరావతి : రాష్ట్రంలో ప్రజల భూములు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు (Chandra Babu) ఆరోపించారు. ఏపీలోని చీరాలలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం (Prajagalam) ఎన్నికల బహిరంగ ప్రచారంలో ఆయన మాట్లాడారు.
జగన్ను మరోసారి గెలిపిస్తే ల్యాండ్ టైటిలింగ్ (Land Titling) చట్టాన్ని తీసుకువచ్చి రైతులు, భూ యజమానుల ప్రమేయం లేకుండానే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్పీ (Mega DSC) పై తొలి సంతకం , రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ (Land Titling) చట్టం దస్త్రంపై రెండో సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల భూములపై జగన్ పెత్తనమేమిటని ప్రశ్నించారు. సైకో జగన్ను ఇంటికి సాగనంపాలని కోరారు.
రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యంతో మహిళల తాళిబొట్లను తెంపారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యంగా తయారు చేశారని విమర్శించారు. దుర్మార్గ పాలనను తుదముట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని భరోసా ఇచ్చారు. జగన్ పాలనలో ధరలు విఫరీతంగా పెరిగిపోయాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని ఆరోపించారు. ఐదేండ్లలో రూ. 250 ఉన్న కరెంట్ బిల్లులు ఐదేండ్లలో వెయ్యి రూపాయలు చేశారని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోలు ధరలు పెంచారని, దీంతో నిత్యావసర ధరలు ఆకాశనంటుతున్నాయని విమర్శించారు. ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని అధికార వైసీపీ పార్టీ ధరలు పెంచి ప్రజలను దోచుకుందని ఆరోపించారు. రాష్ట్రాన్ని రూ.13 లక్షల అప్పులపాలు చేశారని పేర్కొన్నారు.