విజయనగరం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును స్కూల్ బస్సు ఢీకొన్న ఈ సంఘటనలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. జాతరకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతులు, బాధితులు అందరూ ఒకే కుంటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం పరిధిలోని టెక్కలివలస వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు పాఠశాల బస్సు అటుగా వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వేగంగా ఉన్న స్కూల్ బస్సు అదుపు తప్పి బైక్ను ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు.
గాయపడిన ఇద్దరిని స్థానికులు, పోలీసులు చికిత్స నిమిత్తం రాజాం దవాఖానకు తరలించారు. పెరుమాళ్ల నుంచి రాజాం జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నదని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో బైక్పై ఐదుగురు ఉన్నారు. మృతులను సిద్ధూ, హర్ష, రుషిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా 9 ఏండ్ల లోపు వారు కావడం గమనార్హం.