Viral Video | ఏపీలో ఓ కీచక ఎస్సై బాగోతం బయటకొచ్చింది. న్యాయం కోసం ఓ గిరిజన మహిళ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తే.. ఆమె అవసరాన్ని అవకాశంగా చేసుకుని ఓ ఎస్సై లైంగికంగా సుఖపెట్టాలని వేధింపులకు దిగాడు. ఆమెకు రోజూ రాత్రి వీడియో కాల్స్ చేసి.. నగ్నంగా మారి అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతేకాకుండా సదరు మహిళను కూడా బట్టలిప్పేయాలని ఒత్తిడి చేశాడు. రోజూ ఇదే తంతు కావడంతో విసిగెత్తిపోయిన బాధిత మహిళ.. వీడియో కాల్‌ను రికార్డు చేయడంతో ఈ బాగోతం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలోని పట్నం పోలీస్ స్టేషన్‌ను ఇటీవల ఓ గిరిజన మహిళ ఆశ్రయించింది. తన బంధువైన మరో మహిళ విడాకుల కేసులో భరణం ఇప్పించడం గురించి చర్చించేందుకు వెళ్లింది. ఇదే అవకాశంగా తీసుకున్న ఎస్సై రాజశేఖర్ ఆమెను లైంగికంగా వేధించాడు. తన కోరిక తీరిస్తేనే కేసులో న్యాయం చేస్తానని.. లేదంటే ఇబ్బందులు తప్పవని వేధింపులకు గురిచేశాడు. ఆమె నంబర్ తీసుకున్న ఎస్సై రాత్రివేళల్లో ఆమెకు పదేపదే వీడియో కాల్స్ చేసేవాడు. తాను నగ్నంగా కనిపించడమే కాకుండా.. మహిళను కూడా బట్టలు విప్పాలని ఒత్తిడి చేసేవాడు. తన భార్యను విడిచిపెట్టాలని సదరు మహిళ భర్త బతిమిలాడినప్పటికీ ఎస్సై వినిపించుకోలేదు. వీడియో కాల్స్ చేయడంతో పాటు ఆమె వెంటపడేవాడు. ఆమె అనంతపురం వెళ్లినప్పుడు ఆమెను వెంబడించి, బలవంతంగా వాహనంలో ఎక్కాలని ఒత్తిడి చేసేవాడు.
రోజురోజుకీ ఎస్సై రాజశేఖర్ వేధింపులు మితిమీరుతుండటంతో తట్టుకోలేకపోయిన సదరు మహిళ.. వీడియో కాల్ చేసినప్పుడు రికార్డ్ చేసింది. అందులో టవల్లో ఉన్న ఎస్సై రాజశేఖర్.. సదరు మహిళతో అసభ్యంగా మాట్లాడాడు. అంతేకాకుండా టవల్లో నుంచి తన మర్మాంగాన్ని బయటకు తీసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వీడియో ఇప్పుడు బయటకు రావడంతో కీచక ఎస్సై బాగోతం బయటపడింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఎస్సైని వీఆర్‌కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై రాజశేఖర్ మీద వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విచారణ అనంతరం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.