Sathya Sai | శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇద్దరూ ఇప్పుడు సోషల్‌మీడియాలో నెటిజన్లకు టార్గెట్‌గా మారారు. వాళ్లు చేసిన ఓ పనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇద్దరూ కలిసి బైక్‌పై చక్కర్లు కొట్టిన ఫొటోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించనున్న సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీశ్‌కుమార్ ఇటీవల పర్యవేక్షించారు. ఇద్దరూ బుల్లెట్ బైక్‌పై వెళ్లి వేడుక ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బైక్ నడుపుతుండగా, ఎస్పీ వెనుక సీటులో కూర్చున్నారు. ఇలా ఉన్నతాధికారులు ఇద్దరూ కూడా బైక్ డ్రైవ్ చేస్తూ నగరంలోని పలు ప్రాంతాల్లో చక్కర్లు కొట్టారు.
కలెక్టర్, ఎస్పీ ఇద్దరూ కలిసి బైక్‌పై వెళ్లిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. కలెక్టర్, ఎస్పీ ఇద్దరూ మంచి కోఆర్డినేషన్‌తో పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయడంపై జిల్లా మంత్రి సవితతో పాటు పలువురు ప్రశంసలు కూడా కురిపించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.. కానీ ఇక్కడే అసలు సమస్య వచ్చింది. అదేంటంటే.. బైక్ నడిపినప్పుడు కలెక్టర్ శ్యాంప్రసాద్ హెల్మెట్ పెట్టుకోలేదు.. వెనుక కూర్చున్న ఎస్పీ సైతం హెల్మెట్ పెట్టుకోవాలని కలెక్టర్‌కు సూచించలేదు. హెల్మెట్ పెట్టుకోకుండా ఇద్దరూ కలిసి బైక్‌పై తిరగడం మీద నెటిజన్లు మండిపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని.. హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించే ఉన్నతాధికారులే వాటిని పాటించకపోవడమేంటని విమర్శిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని కలెక్టర్, ఎస్పీని ప్రశ్నిస్తున్నారు.