Somireddy Chandra Mohan Reddy | తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఒక్క అడుగు తగ్గి సీఎం చంద్రబాబే హైదరాబాద్కు వెళ్లారని తెలిపారు. కేసుల కారణంగా కేంద్రం నుంచి వాటాలు తేలేకపోయామని చెప్పారు. విభజన అంశాలపై ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి వ్యాఖ్యలు విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. మరోసారి చంద్రబాబుపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి ఆ రంగానికి ఏమీ చేయలేదని సోమిరెడ్డి ఆరోపించారు. మైక్రో ఇరిగేషన్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఖర్చు చేయలేకపోయారని విమర్శించారు. జగన్ ఒక నియంతలా వ్యవహరించారని, ఆయన హయాం కర్ఫ్యూని తలపించిందని అన్నారు. వైసీపీ పాలనలో తిరుమలను భ్రష్టు పట్టించారని, ఆలయ పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు. బెంగళూరు రేవ్ పార్టీలో కాకాణి కారు పాస్ దొరికిందని చెప్పారు. వైసీపీ హయాంలో రాష్ట్రం డ్రగ్స్, గంజాయికి కేంద్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభజన అంశాలపై తెలుగు రాష్ట్రాల భేటీపై మాజీ మంత్రి కాకాణి నిన్న తీవ్ర విమర్శలు చేశారు. అసలు రేవంత్ రెడ్డితో చంద్రబాబు ఏం చర్చించారో మీడియాకు చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరింది నిజమా? కాదా? చెప్పాలన్నారు. ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రూపంలో ఏపీకి పాపం తగిలిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికి పారిపోయి ఏపీకి వచ్చారని ఎద్దేవా చేశారు. ఏపీకి చెందిన ఆస్తులను వదిలేసి ఎందుకు పారిపోయి వచ్చారని నిలదీశారు.