Srisailam Temple | శ్రీశైలం : జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడు రోజుల పంచాహ్నిక దీక్షతో నిత్యం భ్రమరాంబ
మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం ఉదయం చండీశ్వరస్వామికి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రుద్రహోమ పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూజాధికాలు జరిపించారు. ఆలయ పుష్కరిణిలో వైదిక శాస్త్రోక్త అవబృదస్నానం చేయించిన తర్వాత వసంతోత్సవాన్ని నిర్వహించారు. సంక్రాంతి రోజు స్వామిఅమ్మవార్లకు కల్యాణం జరిపిన అనంతరం.. సాంప్రదాయం ప్రకారం భ్రమరాంబదేవి అమ్మవారికి మెట్టెలు నల్లపూసలు సమర్పించే నాగవల్లి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నిత్యకల్యాణ మండపంలో సదస్యం వేదస్వస్థి తర్వాత ఉత్సవాల్లో దేవతవలకు ఆహ్వానం పలుకుతూ ఆవిష్కరించిన ధ్వజపటాన్ని అవరోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాస రావు వేదశ్రవణంతో ఆధ్యాత్మిక శోభ భారతీయ జీవనశైలికి ఆధారమైనవి చతుర్వేదాలేననన్నారు. సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 32మంది వేదపండితులచే సామవేదం, రుగ్వేదం, అధర్వణవేదం, యజుర్వేద పఠనాన్ని చేయించారు. ఉదయం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రెండు గంటల పాటు వేదాలను పఠింపజేసిన తరువాత సదస్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాన్యులకు కూడా వేదసారాలు అర్థమయ్యే ఆవశ్యకత ఉన్నందున ప్రత్యేకంగా వేదసభ నిర్వహించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. వేద పఠనానికి వచ్చిన పండితులకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రంతోపాటు నూతనవస్త్రాలు ఇచ్చి ఘనస్వస్తి నిర్వహించినట్లు స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు వివరించారు.