అమరావతి: ఓ చిన్న రోడ్డు కోసం ఒక్కోసారి నెలలు, సంవత్సరాలు ఎదురుచూడాల్సి వస్తుంది. అలాంటిది అమాత్యులు తలుచుకుంటే ఏ పనైనా గంటల్లోనే పూర్తికావాల్సిందే. అది కూడా ఓ అవ్వ కోరికను పూర్తి చేయడానికి స్వయంగా మంత్రిగారే రోడ్డు పనుల్లో పార చేతబట్టాడు. ఒక్కరోజులోనే ఎట్టకేలకు ఆ అవ్వ కోరిక తీరింది. వివరాల్లోకెళితే..
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రామచంద్రాపురం మండలం పరిధిలోని భీమక్రోసుపాలెంకు వెళ్లారు. ఈ ప్రాంతంలో గత మూడు రోజులుగా ఆయన పాదయాత్ర చేపడుతూ ప్రజాసమస్యలను వింటున్నారు. విషయం తెలుసుకున్న గుండుపల్లి మంగాయమ్మ అనే వృద్ధురాలు మంత్రి చెల్లుబోయినను కలుసుకుని తమ ఇంటికి రోడ్డు వేయాల్సిందిగా విన్నవించుకున్నది. గత వారం, పది రోజులుగా పడుతున్న వానలతో నరకయాతన అనుభవిస్తున్నామని బోరున ఏడ్చింది.
వృద్ధురాలి ఆవేదనను అర్ధం చేసుకున్న మంత్రి చెల్లుబోయిన.. వెనువెంటనే ఆ అవ్వ ఇంటికి రోడ్డు వేయడానికి అధికారులను పురమాయించారు. ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రోడ్డు సమస్యను గంటల్లోనే పరిష్కరించేందుకు నడుం బిగించారు. గ్రావెల్ రోడ్డు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించే తడవుగా రోడ్డు పనులు చకచకా మొదలయ్యాయి. రోడ్డు పనులు పూర్తికావస్తున్న సమయంలో స్వయంగా వేణు కూడా పలుగు చేత బట్టి మట్టి తవ్వి రోడ్డు పనుల్లో పాల్గొనడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా తలో చేయి వేశారు. దాంతో గ్రావెల్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. దాంతో వృద్ధురాలు మంగాయమ్మ సంబురపడిపోయింది. మంత్రి చెల్లుబోయినకు కృతజ్ఞతలు తెలిపింది.