అమరావతి : సత్యసాయి జిల్లా పరిగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident ) ముగ్గురు మహిళలు మృతి చెందారు. రొద్దం మండలం దొడగట్టకు చెందిన భక్తులు కొంత మంది కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి ఆటోలో తిరిగివస్తుండగా గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అలివేలమ్మ, ఆదిలక్ష్మమ్మ, శాకమ్మ అనే ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణికులున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.