హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందని పేర్కొన్న న్యాయస్థానం కేసును కొట్టివేసింది. తొమ్మిదేండ్లపాటు సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం వెలువడిన కోర్టు తీర్పుపై రిషితేశ్వరి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేరొన్న నేపథ్యంలో.. రిషితేశ్వరి ఆత్మహత్య లేఖను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి.. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆరిటెక్చర్ కోర్సు చదివేది. అయితే, వర్సిటీలో ర్యాగింగ్, వేధింపుల కారణంగా 2015 జూలై 14వ తేదీన ఆమె ఆత్మహత్య చేసుకున్నది.
ర్యాగింగ్ తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నట్టు సూసైడ్ నోట్లో రిషితేశ్వరి పేర్కొన్నది. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన అప్పట్లో రెండు రాష్ర్టాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేసిన పెదకాకాని పోలీసులు.. సూసైడ్ లెటర్ ఆధారంగా పలువురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో తమకు న్యాయం చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలుస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. తమకు పైకోర్టులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేదని, ప్రభుత్వమే సహాయం చేయాలని కోరారు. తమకు న్యాయం జరగకపోతే మరణమే శరణ్యమని రిషితేశ్వరి తల్లిదండ్రులు తెలిపారు.