తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు సమీక్షించారు. తిరుమలలోని పీఏసీ-4 కమాండ్ కంట్రోల్ రూం సమావేశ మందిరంలో ఈ సమీక్ష నిర్వహించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల కొండపై భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులు చర్చించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల తొలిరోజైన సెప్టెంబరు 27న ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు బందోబస్తు చేపట్టడంతోపాటు వాహన సేవలకు విచ్చేసే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు, దొంగతనాలు జరుగకుండా చర్యలు, క్యూలైన్లలో తోపులాట లేకుండా ఏర్పాట్లు, ఘాట్ రోడ్లలో కూంబింగ్, రాత్రి గస్తీ విధులు, అవసరమైన భద్రతా పరికరాలు తెప్పించుకోవడం, క్యూలైన్లు, బ్యారీకేడ్ల ఏర్పాటు, వసతి సముదాయాల వద్ద పోగయ్యే వ్యర్థాల తొలగింపు తదితర అంశాలపై సమీక్షించారు.
అదనపు ఎస్పీ మునిరామయ్య, వీజీఓ బాలిరెడ్డి, ఈఈ జగన్మోహన్రెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ వేణుగోపాల్, సీఐలు జగన్మోహన్రెడ్డి, చంద్రశేఖర్, ఏవీఎస్వోలు సురేంద్ర, సాయిగిరిధర్, మనోహర్, శివయ్య తదితర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.