హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ పబ్బరాజు సరస్వతి (90) కన్నుమూశారు. చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ (సీఆర్ ఫౌండేషన్) ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో 21 సంవత్సరాలుగా ఉంటున్న ఆమె.. శనివారం రాత్రి వయోభార సమస్యలతో తుదిశ్వాస విడిచారు. సరోజినీదేవి దవాఖానలో కంటి వైద్య నిపుణురాలిగా సేవలందించి ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం తన భర్త సుబ్బారావుతో కలిసి సరస్వతి 2004లో సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో చేశారు.
సుబ్బారావు 2009లో మరణించగా, సరస్వతి ఆశ్రమంలోనే ఉంటూ సీఆర్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కార్యకలాపాలను నిర్వహించారు. ఫౌండేషన్ ఆరోగ్య కేంద్రంలోనే ఆమె కంటి వైద్యురాలిగా 11 ఏండ్లపాటు ఉచిత సేవలు అందించారు. ఆమె కుమారుడు శ్రీనివాస్ వృత్తి రీత్యా కెనడాలో నివసిస్తున్నారు. డాక్టర్ సరస్వతి పార్థివదేహాన్ని ఆమె కోరిక మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నట్టు సీఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు. డాక్టర్ సరస్వతి మృతికి సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కే నారాయణ, ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు కే రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు.