YS Jagan | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో ఆంక్షలు విధించారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ విధించారు. ఈ మేరకు గురువారం నాడు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 25 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అప్పటివరకు నిరసనలు, సభలు ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో బుధవారం వైసీపీ కీలక ప్రకటన చేసింది. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వేంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని ఆరోపించింది. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు వైఎస్ జగన్ తిరుమల దర్శనానికి వెళ్తారని ప్రకటించింది. ఇది కాస్త మరో వివాదానికి దారి తీసింది. జగన్ క్రైస్తవుడు అని.. అన్యమతస్థుడు కాబట్టి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలలోకి అడుగుపెట్టాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తిరుపతిలో ఆంక్షలు విధించడం గమనార్హం.