అమరావతి : ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో స్ధానికులకు విధిగా రిజర్వేషన్ కల్పించాలని కర్ణాటక (Karnataka) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) స్పందించారు. ఐటీ కంపెనీలు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏపీలో ఐటీ సేవల విస్తరణకు రావాలని ట్వీట్ ద్వారా ఆహ్వానం పలికారు.
నాస్కామ్కు స్వాగతం పలికేందుకు ఏపీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. నాస్కామ్(Nasscom) నిరాశను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుందని వెల్లడించారు. ఏపీలో ఐటీ సేవలు, ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్ విస్తరణకు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటీ సేవలు విస్తరించుకోవచ్చని లోకేష్ లేఖ రాశారు.
విశాఖలో ఏఐ, డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని సూచించారు. నాస్కామ్ సభ్యుల వ్యాపారాలను ఏపీకి బదిలీ చేసుకోవచ్చని, కూటమి ప్రభుత్వం అత్యుత్తమ సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని వివరించారు. పెట్టుబడులకు ఆంక్షలు, ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి పరిశ్రమలకు పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. నైపుణ్యం కలిగిన యువత, మానవ వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు.