Srisailam |శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేవస్థానం పరిపాలనా కార్యాలయ భవన ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు ఆవిష్కరించారు. తర్వాత జాతీయ గీతాన్ని ఆలాపించారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయ ప్రకారం మహా గణపతి పూజ జరిపించారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఏడాది కాలంలో దేవస్థానం ప్రగతిని వివరించారు. శ్రీశైలం మహాక్షేత్ర అభివృద్ధికి తీసుకున్న చర్యలు వెల్లడించారు. భక్తులకు సౌకర్యాల కల్పనతోపాటు శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాల నిర్వహణ, క్షేత్రాభివృద్ధి అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
రోజురోజుకు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భాగంగా రూ.35 కోట్ల అంచనా వ్యయంతో ఏడు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించాలని దేవస్థానం భావిస్తుందన్నారు. దీని ద్వారా రోజూ సుమారు 31 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తయ్యే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ఏటా దేవస్థానానికి రూ.7 కోట్ల వరకూ విద్యుత్ చార్జీలు ఆదా అవుతాయన్నారు.
మల్లమ్మకన్నీరు, హటకేశ్వరం, ఫిల్టర్ బెడ్ తదితర ప్రాంతాల్లో రూ.6.20 కోట్ల అంచనా వ్యయంతో మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. అమ్మవారి ఆలయంలో ఉత్తర సాలు మండపాలను రూ.0.99 కోట్ల అంచనా వ్యయంతో పునర్నిర్మిస్తున్నామన్నారు. ఇటీవల పునర్నిర్మించిన పంచ మఠాల చుట్టూ రూ.0.86 కోట్ల అంచనా వ్యయంతో కంచె నిర్మాణం పూర్తి చేశామన్నారు.
ఆలయ ప్రాంగణంలో రూ.70 లక్షల వ్యయంతో అలంకార మండపాన్ని నూతనంగా నిర్మించామని శ్రీనివాసరావు తెలిపారు. రూ.60 లక్షల అంచనా వ్యయంతో దేవస్థానం ఆగమ పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గణేశ సదనం ఎదురుగా మినీ కల్యాణ కట్ట నిర్మిస్తున్నట్లు చెప్పారు. దేవస్థానం స్వర్ణ రధాన్ని భక్తులు వీక్షించడానికి వీలుగా నూతనంగా రథం షెడ్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. దోర్నాలలోని శ్రీశైల దేవస్థాన సత్రంలో కల్యాణ మండపం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతోపాటు శ్రీశైల మహా క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. భక్తులకు ఆహ్లాదం కలిగించేలా శ్రీశైల క్షేత్రమంతా నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. ప్రాచీన కాలం నుంచీ మన ఆలయాలు సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయన్నాయని న్నారు. ఆలయ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.