(రంగనాథ్ మిద్దెల)హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి సర్వజనులకు దేవుడు.. ఆయనకు ప్రాంతీయ భేదాలు లేవు. కులమతాల పట్టింపు అసలే కనిపించదు. అక్కడికొచ్చే భక్తజనం, ఆయన సేవలు చేసుకొనే భాగ్యం కలిగిన అర్చకులకు, నిరంతర వేదనాదం వినిపించే వేదపారాయణదారులకు గతంలో ఈ తారతమ్యాలే లేవు. ఏ ప్రాంతం వారైనా స్వామిసేవలో తరించాలనే సత్సంకల్పం దేవస్థానం నిర్వాహకులకు ఉండేది. కానీ, ఇటీవల టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)లో చోటుచేసుకుంటున్న పరిణామాలు శ్రీవారికి కూడా ప్రాంతీయతను అంటగడుతున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు అడిగితే తమ ప్రాంతం వారికి ఎన్ని పోస్టులు ఇచ్చామో చెప్పాలని, అందుకోసం ముందుగా వారిశాతం పెంచాలంటూ కొందరు వేదపరీక్ష అధికారులు స్వామి మెప్పుకోసం చేసిన నిర్వాకమిది. ఇందులో టీటీడీ చైర్మన్ సహా రాజకీయ ప్రముఖులు కూడా పరీక్షాధికారులను ఒత్తిడి చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా విజయవాడ, ఉభయగోదావరి జిల్లాల్లో కొందరు వేదపండితులు తమ ప్రాంతం వారి కోసం పైరవీలు చేశారని, ఇక్కడ కూడా లక్షలకు లక్షలు చేతులు మారాయనే ప్రచారం జరుగుతున్నది.
ఇదంతా ఒక ఎత్తయితే అసలు తెలంగాణ అనే పేరు కనబడితేనే పరీక్షాధికారులు వారికి నియామకాల్లో చోటు కల్పించలేదంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ (ఎస్వీఐహెచ్వీఎస్) ద్వారా టీటీడీ చేపట్టిన వేదపారాయణ పథకం కింద 791 పోస్టుల (అందులో 700 కొత్తవి, 91 పాత ఖాళీలు) నియామక ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర వేదపండితులకు తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుడు ఆగస్ట్ 6న టీటీడీ దేశవ్యాప్తంగా అర్హులైన వేదపండితుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుపతి, హైదరాబాద్ కేంద్రాల్లో నిరుడు నవంబర్ నాటికి ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి.
ఈ ప్రక్రియలో మొత్తం 2,901 దరఖాస్తులు రాగా, అందులో 2,502 మంది (ఇందులో ఒకరు హైకోర్టు ద్వారా తమ అర్హతను పరిగణించాలని కోరడంతో అతనితో కలిపి) ఇంటర్వ్యూలకు అర్హులుగా ప్రకటించారు. వీటిలో ఇంటర్వ్యూలకు 2,158 మంది హాజరయ్యారు. అందులో మొత్తం 746 మందిని ఎంపిక చేసి, 39 మంది ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అంటూ వేర్వేరుగా జాబితాలను విడుదల చేశారు. మిగతా ఆరు పోస్టులకు సంబంధించి టీటీడీ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అభ్యర్థుల్లో వారి స్థానికత విషయంలో కొంతమేరకు అనుమానం ఉండటంతోపాటు వారి స్థానికత సర్టిఫికెట్లను సమర్పించాల్సిందిగా మౌఖికంగా చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు జూలై 14న జరిగిన బోర్డు మీటింగ్ తీర్మానం నం.129 ప్రకారం మొత్తం 791 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికే 636 పోస్టులను కేటాయించి దేశంలోని మిగతా అన్ని రాష్ర్టాలకు కేవలం 155 పోస్టులు మాత్రమే కేటాయించారు.
అఖిలభారత స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసి ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత అర్హత నిబంధనలు మార్చి, స్థానిక ప్రాధాన్యత పేరుతో తెలంగాణలోని పలు వేదశాఖల అభ్యర్థుల అవకాశాలను పూర్తిగా దెబ్బతీశారు. ఫలితాల తర్వాత అంటే అర్హులందరి మార్కులు అధికారుల చేతికి వచ్చిన తర్వాత 2025 డిసెంబర్ 20న స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో ప్రొఫెసర్ ఎస్ సుదర్శన శర్మ, డాక్టర్ మేడసాని మోహన్, ప్రొఫెసర్ కేటీఆర్కుమారశర్మ, విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనాపాఠితో పాటు ప్రాజెక్ట్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. 2025 జూలై 22న టీటీడీ బోర్డు తీర్మానం నం.351 ప్రకారం 85శాతం మార్కులు అర్హత ప్రమాణంగా నిర్ణయించారు. కానీ ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత 1978 నాటి జీవో 219లో కనీస మార్కుల ప్రస్తావన లేదనే సాంకేతిక సాకుతో అర్హత మార్కులను 85 నుంచి 40కి తగ్గిస్తూ స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది.
స్క్రీనింగ్ కమిటీ ఫార్ములా కింద లిఖితపూర్వకంగా నూరుశాతం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపు నిబంధనతో ‘ఆల్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ టు బీ అకామడేటెడ్’ అని రాసి ఉన్నది. ఈ ఫార్ములాను టీటీడీ బోర్డు చైర్మన్ ఆమోదిస్తూ అధికారిక తీర్మానం జారీచేశారు. బోర్డు అజెండా పాయింట్-7లో 85శాతం మార్కులు అర్హత ప్రమాణంగా నిర్ణయించగా, స్క్రీనింగ్ కమిటీ దానిని 40 శాతానికి తగ్గించిందని అధికారుల కమిటీ స్వయంగా రికార్డు చేసింది. కనీస అర్హత మార్కులను 40కి తగ్గించి అత్యధికంగా ఆంధ్రాకు కేటాయించడం వల్ల అక్కడ తక్కువ మార్కులొచ్చిన వారికి కూడా ఆ పోస్టుల్లో అవకాశాలు లభించాయి.
కానీ ఇతర రాష్ర్టాల కోటా పరిమితి కారణంగా తెలంగాణలో అత్యుత్తమ మార్కులు సాధించిన పండితులకు సైతం పలు శాఖల్లో ఒక్క పోస్టు కూడా దక్కకుండా పోయింది. ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అర్హత నిబంధనలు మార్చడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పులు చెప్తున్నాయని, వాటిలో కొన్నింటిని తెలంగాణ వేదపండితులు ప్రస్తావిస్తున్నారు. ఆలిండియా నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత స్థానిక ప్రాధాన్యత ఫార్ములాను అమలు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16ను ఉల్లంఘించడమేనంటూ వారు ఆరోపిస్తున్నారు. కోటా తగ్గించిన కారణంగా సింగిల్ డిజిట్ రాష్ర్టాలకు 29, మిగతా రాష్ర్టాలకు 2:3 నిష్పత్తిలో 45, 81 పోస్టులు కేటాయించినట్టు తెలుస్తున్నది.
గతంలో వేదపారాయణదారుల నియామకం జరిగినప్పుడు తమిళనాడు వారికే అధికంగా ఉద్యోగాలు వచ్చిన గణాంకాలు చెప్తున్నాయి. టీటీడీ వేదపారాయణదారు పథకం కింద ఎంపికైన వేదపండితులు దేశవ్యాప్తంగా తమకు దగ్గరలోని ఆలయాలు, ప్రసిద్ధి చెందిన మఠాల్లో రోజూ ఉదయం రెండుగంటలు, సాయంత్రం రెండుగంటలు పారాయణం చేయాలి. దీంతోపాటు ప్రతినెలా మూడురోజుల పాటు దేశవ్యాప్తంగా సంపూర్ణ వేదపారాయణం నిర్వహించాలి. ఈ క్రమంలో ఈ నియామకానికి ముందు ఉన్న 1,277 మంది వేద పండితుల్లో తెలంగాణ నుంచి 167 మంది అంటే 13 శాతం మంది మాత్రమే ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 376, తమిళనాడు నుంచి 515, కర్ణాటక నుంచి 103, కేరళ నుంచి 15, మహారాష్ట్ర 66, ఉత్తరప్రదేశ్ 14, గోవా 3, కోల్‌కతా 1, ఒడిశా 7, గుజరాత్ 4, రాజస్థాన్ 4, మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు పారాయణదారులు ఉన్నారు. వీరంతా క్రమాపాఠి, ఘనాపాఠిలు. వీరితోపాటు 52 మంది వృద్ధ పండితులు, 11 మంది సూపర్వైజర్లు, ఇద్దరు ఈసీ మెంబర్లు.. మరణించడం వల్ల ఏర్పడిన ఖాళీలు మరో 91. అన్నీ కలిపి 1,433 ఉన్నాయి. ఉన్న 1,277 మందిలో తమిళనాడు నుంచే 515 మంది అంటే 40 శాతం పండితులు ఉన్నారు.
వీటికి తాజాగా 2025లో ఇచ్చిన నోటిఫికేషన్‌లోని 700 పోస్టులు కలిపి మొత్తం 2,133 మంది వేదపారాయణదారులు ఉంటారని టీటీడీ ప్రకటించింది. టీటీడీలో వేదపారాయణదారుల పోస్టులు మొత్తం 791 నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ నిరుడు విడుదలైంది. ఆ సమయంలో కొందరు ఆంధ్రా ప్రాంతీయులను ఎంపిక చేసినప్పటికీ అందులో కొందరు తమిళనాడు వారికి ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయంటూ ఆరోపించి ఆందోళనలకు దిగడంతో ఇంతవరకు టీటీడీలో ఎంతమంది ఎంపికయ్యారనే దానిపై రాష్ర్టాల వారీగా లెక్కలు తేల్చారు. అందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి ఎంపికైనట్టు తేలింది. దీంతో ఆంధ్రాప్రాంతం వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ముఖ్యమైన అంశాన్ని రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. ఇక్కడే అసలు రాజకీయం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. నియామకాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యం పెంచాలంటూ సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆ తర్వాత స్థానం తెలంగాణ వారికి ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చినా.. అదేదీ లేకుండా మొత్తం ఆంధ్రా పండితులకే అవకాశాలు దక్కడంపై తెలంగాణ పండితులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
ఆంధ్రాప్రాంతానికి చెందిన ప్రత్యేకించి కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కొందరు పరీక్షాధికారులు తమ వారికి ఉద్యోగాలు దక్కాలనే స్వార్థంతో తమవారిని ఎంపిక చేసేందుకు ప్రయత్నించారు. వారు అనుకూలంగా ఉన్న అన్ని వనరులను వినియోగించుకొని దాని ద్వారా ప్రాంతీయత ఆధారంగా ఈ ఎంపికలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై చైర్మన్ ద్వారా ఒత్తిడి తెచ్చారని సమాచారం. తెలంగాణకు నష్టం జరిగినా పర్వాలేదని, ముందుగా తమవారికే ఉద్యోగాలు ఇవ్వాలంటూ మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ప్రాంతీయత అనేది టీటీడీ వేదపండితులను గుర్తించే విషయంలో ఉండొద్దని, తెలంగాణలో పరీక్షల సమయంలో తమ పోరాటాన్ని గుర్తు చేస్తున్న వేదపండితులు చెప్తున్నారు. ఇంటర్వ్యూల విషయంలో తమిళ ప్రాంతానికి చెందిన వారికి కేటాయింపులు జరుగడం అనేది పూర్తిగా దారుణమని వారు పేర్కొంటున్నారు. ఆ కారణం చూపి చివరకు ఆంధ్రా పండితులకే ప్రాధాన్యం ఇచ్చారు. మొన్న తెలంగాణ దేవాదాయ శాఖలో జరిగిన వేదపండితుల పోస్టుల్లో కూడా ప్రాంతీయత కోసం పోరాటాలు జరిగాయి.
కానీ ఇక్కడ నోటిఫికేషన్లో తెలంగాణ ప్రాంతం వారికే అని అర్హత ప్రకటించినప్పటికీ ఆంధ్రావారికి కూడా ఇక్కడ ఉద్యోగాలు దక్కాయి. కేవలం ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు తెలంగాణలో ఉండి ఇక్కడే ఆధార్ కార్డు తీసుకొన్న కారణంగా వారు తెలంగాణ స్థానికత అర్హత పొందడమే ఇందులో ప్రధాన అంశం. టీటీడీలో మాత్రం పుట్టిన స్థలం, చదువుకున్న ప్రాంతం, ప్రస్తుత నివాసం ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రాప్రాంతం వారికే ప్రాధాన్యమిస్తూ తెలంగాణలో ఉండే జన్మతః ఆంధ్రావారికి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ కింద పెట్టారంటూ వేదపండితులు చెప్తున్నారు. తమకు శ్రీనివాసుడి అనుగ్రహంతో ఆలయాల్లో వేదపారాయణం చేయడానికి తమకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలంగాణ వేదపండితులు చెబుతున్నారు.
2025లో ఇచ్చిన నోటిఫికేషన్‌లోని 700 వేద పారాయణ పోస్టులకు ఇప్పటికే ఖాళీగా ఉన్న 91 పోస్టులు కలిపి మొత్తం 791 పోస్టులకు నియామక ప్రక్రియ నిర్వహించారు. వేదపరిరక్షణ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అన్ని వేదశాఖలను సమానంగా ప్రోత్సహించాలనే మూల లక్ష్యం ఈ నియామక ప్రక్రియ ద్వారా దెబ్బతిన్నదని పరీక్షలకు హాజరైన అభ్యర్థులు మండిపడుతున్నారు. ఇతర రాష్ర్టాల కోటాను కుదించడం వల్ల తెలంగాణ వంటి రాష్ర్టాల్లో పలు వేదశాఖలకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. తాజా నియామకాల్లో ఇతర రాష్ర్టాల ప్రాతినిధ్యాన్ని భారీగా కుదించి, ఒక్క ఆంధ్రప్రదేశ్ వాటాను 29శాతం నుంచి ఏకంగా 49శాతానికి అంటే 1,012 మందికి పెంచారు.
తాజా నోటిఫికేషన్‌తో కలిపి టీటీడీలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వాళ్లే ఎక్కువగా వేదపారాయణ పోస్టుల్లో ఉంటుండగా, తెలంగాణ నుంచి అతి తక్కువ మంది ఉండటం గమనార్హం. తెలంగాణలో పలు వేదశాఖలకు అంటే శుక్ల యజుర్వేదం, అధర్వణవేదంతో పాటు మరికొన్ని వేదశాఖల్లో తెలంగాణ నుంచి హాజరైన అభ్యర్థులకు తుది ఎంపిక జాబితాలో ఒక్క పోస్టు కూడా కేటాయించలేదు. టీటీడీలో నియామక ప్రక్రియలో చాలావరకు ప్రతిభకు పట్టంగట్టడం ప్రాధాన్యంగా ఉంటూ ప్రాంతీయ తత్వానికి దూరంగా ఉండటం తొలినాళ్ల నుంచీ వస్తున్నది. అన్ని ప్రాంతాల వారికి సమాన ప్రాతినిధ్యం కల్పించడం, ఒకవేళ అంతగా అవసరమైతే రెండు తెలుగు రాష్ర్టాలకు సమప్రాధాన్యం ఇచ్చి తమిళనాడు, కర్ణాటక, ఒడిశా వంటి వారికి అవసరాన్ని బట్టి అవకాశం కల్పించడం జరిగేదని టీటీడీలో గతంలో పనిచేసిన ఒక పరీక్షాధికారి చెప్పారు.