మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏడాదిన్నర నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతన్ని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అతనితో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
లంకమల్లి అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను ఢిల్లీకి రవాణా చేస్తున్నారనే సమాచారంతో కడప జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నాగదస్తగిరి రెడ్డితో పాటు మరో ఐదుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి టన్ను ఎర్రచందనం దుంగలను, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు.
జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న లాలా బాషా, ఫక్రూద్దీన్ ఆధ్వర్యంలో ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తుందని పోలీసులు తెలిపారు. నాగదస్తగిరిపై ఇప్పటికే 86 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు, 34 చోరీ కేసులు, 3 పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నాగదస్తిగిరి భార్య లాలూబీని కూడా వారం క్రితం పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.