అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారనుంది. తీవ్ర వాయుగుండం ఎల్లుండి ఉదయానికి ‘మొంథా’ తుపానుగా (Cyclone Montha ) మారే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు రెడ్ అలెర్ట్ (Red alert) జారీ చేశారు.
వచ్చే నాలుగురోజుల ఈనెల 29 వరకు తుపాను చాలా ప్రభావం చూపిస్తుందని అధికారులు వివరించారు. తుపాను వాయవ్య దిశలో కదిలి ఈ నెల 28 సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గంటలకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని స్పష్టం చేశారు.
విశాఖపట్నం నుంచి తిరుపతి వరకూ తుపాను ప్రభావం ఉండనుందని తెలిపారు. ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు 28,29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు ప్రభుత్వానికి సూచించారు. భారీ వర్షాలు పడే అవకాశమున్నందున విజయవాడ, ఏలూరు, దివిసీమ, మచిలీపట్నం, గుంటూరు , గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.