తిరుమల : భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల నాదనీరాజనం వేదికపై నిర్వహించిన విష్ణుసహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేదిక మీద పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పక్కన శ్రీ భీష్మాచార్యుల ప్రతిమను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామిజీ పాల్గొని ప్రసంగించారు. శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని మొదటి, రెండు, మూడవ పర్యాయాలు పఠించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయని వేదాల్లో చెప్పినట్లు తెలిపారు.

మన జీవితంలో ధర్మాన్ని తెలుసుకునేందుకు అవకాశం, శక్తి సరిపోదని అన్నారు. విష్ణుసహస్రనామాన్ని పారాయణం చేసే వారు భగవంతుడి సన్నిధికి చేరుతారని పేర్కొన్నారు. వేద సంస్కృత పండితులు శేషాచార్యులు, కుప్పా నరసింహం, డా. టి. బ్రహ్మచార్యులు విష్ణుసహస్రనామ స్తోత్ర విశిష్టతను వివరించారు. టీటీడీ అదనపు ఈవో ఎవి. ధర్మారెడ్డి, ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.