అమరావతి : రేషన్ బియ్యాన్ని (Ration rice ) ఇతర దేశాలకు తరలిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో శనివారం పింఛన్లను పంపిణీ చేసి గ్రామ సభలో మాట్లాడారు. పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని కొందరు వ్యాపారులు అధిక ధరకు కొనుగోలు చేసి విదేశాలకు తరలించి కోట్లు గడిస్తున్నారని పేర్కొన్నారు. రేషన్ బియ్యం వ్యాపారులను వదిలిపెట్టబోమని అన్నారు.
వైసీపీ(YCP) పాలనలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. తవ్విన కొద్ది తప్పులు బయటపడుతున్నాయని, ఎక్కడ చూసిన అప్పులే సృష్టించారని ఆరోపించారు. వైసీపీ పాపాలు భయట పడుతున్నాయని, ఐదేండ్లలో రూ. 10 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని గట్టేక్కించేందుకు అడుగులు వేస్తున్నామని అన్నారు.
మెగా డీఎస్సీ (Mega DSC) ద్వారా ఉద్యోగాలు కల్పించనున్నామని తెలిపారు. సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరుగాలని, వచ్చిన సంపదను పేదలకు పంచి ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పింఛన్లు అందిస్తున్నామని వెల్లడించారు.
నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని వివరించారు. మద్యం దోపిడికి అడ్డుకట్టవేశామని తెలిపారు. ఎక్కడైనా బెల్ట్‌షాపులు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకృతి ఇచ్చిన ఇసుకను వైసీపీ పాలకులు వ్యాపారంగా చేసుకుని వేల కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపించారు.