తిరుపతి : ఈనెల 28న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, 8.30 నుంచి 9.30 గంటల వరకు హంస వాహనంపై ఊరేగుతారని అన్నారు.
ఉదయం 10 నుంచి 11 గంటల వరకు అశ్వ వాహనం, 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారని పేర్కొన్నారు. రాత్రి 8.30నుంచి 9.30 గంటల వరకు గజ వాహన సేవ నిర్వహిస్తారని వివరించారు. సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తామన్నారు.
ఈసందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, సామవేద పుష్పాంజలి, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు వివరించారు. .తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుంచి 7.00 గంటల వరకు స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతారని వెల్లడించారు. రథసప్తమి పర్వదినం పురస్కరించుకుని జనవరి 24న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది .