Paritala Sunitha | మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఏ విషయంలో అయినా ఓ ఎమ్మెల్యేగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని అన్నారు. నువ్వు ఏం ఇక్కడ మైసూర్ మహారాణివి కాదని మండిపడ్డారు. పోలీసులను అడగడానికి వెళ్లిన ప్రజలపై ఎందుకు కేసులు పెట్టావని ప్రశ్నించారు.
హామీల అమలుపై ప్రశ్నించిన జనాలకు చెప్పులు చూపిస్తావా అని పరిటాల సునీతపై తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్ష నేతగా అడిగితే చెప్పు తెగుద్ది అని అంటావా అని మండిపడ్డారు. పరిటాల ట్యాక్స్‌లతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో భారీ స్కామ్ జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఒక్కో ఇంటి నిర్మాణంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు రూ.10వేలు కమిషన్ వసూలు చేస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు దమ్ము ధైర్యం ఉంటే విచారణ చేయాలని సవాలు విసిరారు.
పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ అవినీతిపరులు అని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచుకుంటున్నారని అన్నారు. పరిటాల సునీత కుటుంబానికి వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నాయని తెలిపారు. దసరా పండుగ రోజు 8 కార్లకు, గన్లకు ఆయుధ పూజ చేయించారని పేర్కొన్నారు. ఇదంతా ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము కాదా అని ప్రశ్నించారు. పరిటాల కుటుంబం దానం చేసే కుటుంబమని సునీతమ్మ చెప్పుకుంటున్నారని.. ఎక్కడ దానం చేశావో చెప్పాలని నిలదీశారు. మేం ప్రజల కోసం డబ్బులు పెట్టి తీసుకొచ్చిన నీళ్లను అడ్డుకున్నావు.. రైతుల కడుపులు కొట్టావు అని మండిపడ్డారు. పరిటాల కుటుంబం ధానధర్మాలు చేస్తుందని రాప్తాడు నియోజకవర్గంలో మీ టీడీపీ కార్యలనే చెప్పమను అని ప్రశ్నించారు. హామీల అమలుపై ప్రశ్నించిన వారికి చెప్పు తెగుద్ది అని పరిటాల సునీత అంటున్నారని అన్నారు. ప్రజలు తిరగబడితే ఎవరి చెప్పులైనా తెగుతాయని పరిటాల సునీత గుర్తించాలని హితవు పలికారు.