Janasena | ఏపీ రాజకీయాల్లో రసవత్తరమైన సంఘటన చోటు చేసుకుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ అప్పట్లో సంచలనం సృష్టించారు. జనసేన నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే కావడంతో అధికార పార్టీ వైసీపీతోనే సన్నిహితంగా ఉన్నారు. జనసేనను వీడి వైసీపీలో కూడా చేరారు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత రాపాక మళ్లీ జనసేన నిర్వహించిన ఓ సమావేశంలో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కోనసీమ జిల్లా మలికిపురంలో కూటమి పార్టీలు నిర్వహించిన క్రియాశీలక కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఇదే సమావేశానికి రాజోలు మాజీ ఎమ్మెల్యే అయిన రాపాక హాజరయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను రాపాక కలవడం ఇది రెండోసారి. దీంతో రాజోలు నియోజకవర్గంలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
త్వరలోనే వైసీపీకి రాజీనామా చేస్తానని రాపాక వరప్రసాద్ ప్రకటించారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు తెలియజేశానని తెలిపారు. అనివార్య కారణాల వల్ల జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. వైసీపీలో చేరిన తర్వాత పార్టీ అధిష్ఠానం ఆదేశాలను పాటించానని చెప్పారు. కానీ 2024 ఎన్నికల్లో తనను కాదని రాజోలు నుంచి గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చారని తెలిపారు. ఇష్టం లేకపోయినా తనను అమలాపురం నుంచి ఎంపీగా పోటీచేయించారని పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరేది తొందరలోనే చెబుతానని స్పష్టం చేశారు.
2019 ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన తరఫున గెలిచిన రాపాక అప్పుడు వైసీపీతో కలిసిపోయారు. 2024 వైసీపీ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ గొల్లపల్లి సూర్యారావుకు వైసీపీ టికెట్ ఇచ్చింది. అలాగే అమలాపురం నుంచి రాపాకకు ఎంపీ టికెట్ ఇచ్చారు. కానీ అమలాపురంలో రాపాకకు అంతగా పట్టులేకపోవడంతో అందులో ఘోర పరాభవం చెందారు. దీంతో ఎన్నికల తర్వాత రాపాక టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కూటమి పార్టీలు నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం గమనార్హం.