మాజీ ఎంపీ మార్గాని భరత్‌పై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విరుచుకుపడ్డారు. తన ప్రచార రథం దగ్ధం చేసేందుకు టీడీపీ కోవర్ట్ ఆపరేషన్ చేసిందంటూ మార్గాని భరత్ చేసిన కామెంట్లపై మండిపడ్డారు. భరత్ చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. తప్పులు చేసి తమపై నిందలు వేయొద్దని సూచించారు. మార్గాని భరత్ మంచి నటుడని ఎద్దేవా చేసిన ఆయన.. నటిస్తే ఫర్వాలేదని.. జీవిస్తేనే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.
తన ప్రచార రథం దగ్ధంలో ప్రమేయం లేదని మార్కండేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని మార్గాని భరత్ విసిరిన సవాలుపై కూడా ఆదిరెడ్డి వాసు సెటైర్లు వేశారు. మార్గాని భరత్ ఒట్టేస్తే శివయ్య కూడా పారిపోతాడేమోనని ఎద్దేవా చేశారు. భరత్‌కు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని.. అందుకే దేవుడిని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నాడని మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం దేవుళ్లను మధ్యలోకి తీసుకురావద్దని సూచించారు. ప్రమాణాలు చేయడానికి మీరు ఖాళీగా ఉన్నారేమో.. కానీ మేం కాదని తెలిపారు. ఐదేళ్లుగా తనపై అక్రమంగా కేసులు పెట్టినా ప్రమాణం చేయమని ఎప్పుడూ ఆడగలేదని గుర్తుచేశారు. తాను ప్రజలను మాత్రమే నమ్ముతానని, తాను ఎలాంటి వాడో వాళ్లే నిర్ణయిస్తారన్నారు. రాజకీయం చేయడానికే మార్గాని భరత్ నాటకాలడుతున్నారని మండిపడ్డారు.
కాగా, జూన్ 28వ తేదీ అర్ధరాత్రి 11-45 గంటల ప్రాంతంలో వీఎల్ఫురంలోని మార్గాని ఎస్టేట్స్ కార్యాలయంలో ఉన్న ప్రచార రథం దగ్ధమైంది. ఇది అధికార టీడీపీ శ్రేణుల పనే అని తాను అనుకుంటున్నట్లుగా మార్గాని భరత్ అప్పుడే అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త శివాజీగా తాజాగా గుర్తించారు.
తన ప్రచార రథాన్ని తగులబెట్టింది వైసీపీ కార్యకర్తే అని బయటపడటంతో మార్గాని భరత్ స్పందించారు. ప్రచార రథం దగ్ధం కేసులో సమగ్ర విచారణ జరిపించాలని మార్గాని భరత్ కోరారు. టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నిందితుడిని తమ వద్దకు పంపించి కోవర్ట్ ఆపరేషన్ చేసిందని ఆరోపించారు. శివాజీ అనే వ్యక్తి నెల క్రితమే వైసీపీలో చేరారని తెలిపారు. శివాజీని తన తండ్రికి ప్రధాన అనుచరుడు అనడం సరికాదని చెప్పారు. శివాజీ గతంలో టీడీపీ సోషల్‌మీడియాలో పనిచేశారని చెప్పారు. నిందితుడి బంధువులంతా టీడీపీకి చెందినవారే అని చెప్పారు. దీనిపై మార్కండేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రమాణానికి సిద్ధమా అని సవాలు విసిరారు.